ఒరే వాసుగా

ఎన్నేళ్లయినా గ్రౌండ్లు వదలని ఆటల పిచ్చి

పిచ్చి లాజిక్ లతో చెత్త ఆర్గుమెంట్స్

ఎదుటి వాడిని నోరెత్తనివ్వని పిడివాదం

ఆటల్లో ఒడిపోయేటప్పుడు చేసే రగడ

కాలేజీ గొడవల్లో నీ కాంప్రమైజ్ కలాపం

ఎన్ని గొడవలు పడ్డా స్నేహానికి నువ్విచ్చే విలువ

అవసరం లో ఆడుకోడానికి లోతు చూసుకోకుండా దిగే నైజం

మళ్ళీ కావాలంటే ఎలారా?

జీవితంలో ప్రతిదశ లోను ఆనందాన్ని వేటాడేవు.

ఈలోకంలో అన్నిఅయిపోయాయా?

అంత తొందరగా ప్రయాణమైపోయావు?

కాలం అనే అనుభూతుల ప్రవాహంలో ఈదులాడినవాడివి నువ్వు

ఒడ్డున కూర్చుని ఒకటో రెండో దక్కించుకున్నవాళ్ళమే మేము.

మళ్ళీ మామధ్యకి వచ్చేయ్యారా.

ఏదో ఒకటి నీకు నచ్చిందే చేద్దాం.

ప్రకటనలు

కృష్ణాష్టమి శుభాకాంక్షలు

జననం తోనే మరణంతో సమరం
సమస్యలకి వెరవొద్దనే జ్ఞానం.

గోపబాలబృందంతో వినోదం
ప్రతిచిన్న విషయాన చూడాలే ఆనందం.

బృందావనం లో మురళీగానం
ప్రేమికుల కే పెద్ద ప్రేమపాఠం.

గురువుకిచ్చిన గురుదక్షిణం
నేర్పినవారికివ్వాల్సిన విలువకి నిదర్శనం.

మిత్రునిపై ఉదారం
స్నేహధర్మానికే నిర్వచనం.

వివాహం తో సందేశం
వలచివచ్చిన వనిత అయితేనే సౌఖ్యం.

గీతాజ్ఞానం
మానసికోన్నతికే సోపానం.

జీవితంలో నీ ప్రతిపథం
సమున్నత మానవతకే సోదాహరణం.

గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు

అయితే చండామర్కుల సారు
కాకుంటే బళ్ళో పిల్లలతో సొంత మళ్ళో పని చేయించే సారు

ఇప్పుడు సార్లు కూడా ఆలోచించక్కర్లేనంత మూస విధానం

ఎప్పుడు నా దేశములో అలనాటి నలంద వైభవం

కనీసం ఫిన్లాండ్ తరహా మానసిక వికాసాధారిత నేర్పుడు?

విధాన లోపం, సామాజిక శాపం, అధ్యాపక నిర్వీర్యం
ఎప్పటికి మారేను?

పిచ్చుక

ఎంత బాగా కడతాయి గూళ్ళు
తక్కువ తిని ఎక్కువ పనికి మోడళ్ళు
చక్కని మ్యూజిక్ లాంటి సౌండ్స్ కి నకళ్లు
రెండు డిసైన్ ల లో దొరికే
వండర్ లు
మనిషి పంజాకి బలైపోతున్న దేవుడి అద్భుతాలు

ఉగాది

ఉగాది వచ్చిందోయ్ అన్నాను

కర్రిపాయింట్ లో పచ్చడి దొరుకుతుంది ట అంది మా ఆవిడ హింట్ లాంటి ఆదేశంతో.

అంటే ?అన్నాడు మా చిన్నాడు

వసంతంవొచ్చిందిరా అన్నాను భావుకత్వంగా

యూఎస్ నుండి వచ్చారా అడిగాడు యూజువల్గా.

ఏమైనాసరే పచ్చడి ఇండిజినస్ గా చెయ్యాలి అనుకుని రోడ్డెక్కా

వేపచెట్టు పెంచుకునే వైశాల్యం ఇళ్ళకి, హృదయాలకి లేవని అర్ధమైంది.

కోకిల పాట విందామంటే 4G నెట్వర్క్ పిచ్చుక,చిలకతో పాటు కోకిలను కూడా ఖాళీ చూసినట్టుంది.

పంతులుగారిని పంచాంగం అడుగుదామని వెళ్ళా

ఏడాదికోసారి పాటించే సాంప్రదాయం గుర్తుతెచ్చుకోడానికి హైరానా పడుతున్నారు.

ఇంటికొచ్చి TV పెడితే

ఎబ్బెట్టు ఏంకరింగ్ తో వంటిమీద సంప్రదాయ దుస్తులు ఉంచుకోడానికి నానా బాధ పడుతూ సినిమా వెకిలి క్లిప్పింగ్స్ తో హేపీ యుగాడి అని చెప్తున్నారు.

ఇంతలో ఉగాది పచ్చడి తెచ్చి తట్టిలేపింది మా ఆవిడ ఏంటా పగటినిద్ర అని

శ్రీదేవి

ఆరేళ్లకే ఆర్కులైట్ల మధ్యకి వచ్చి

ఆకు చాటు పిందెలా మెరిసి

అన్ని భాషలలో నటించి

ఆడ సూపర్ స్టార్ అనిపించి

అతిలోకసుందరి గా మురిపించి

అర్ధాయుష్హులో జీవితం ముగించవా???

అయ్యో! శ్రీదేవి!!!

అవే కళ్ళు

బాధను అణుచుకునే కన్నీటి రిజర్వాయర్లు

కఠినాత్ముడినైనా కదలనివ్వలేని జాలి సంకెళ్లు

కోపంలో సృష్టినే భస్మీపటలం చేసే అగ్నిగోళాలు

అసహ్యాన్ని వెళ్ళగక్కే ఇండస్ట్రియల్ ఎగ్జాష్టులు

అమాయకత్వానికి వాకిళ్ళు

అనంత శాంతానికి చలువ పందిళ్ళు

చంచలంగా మెదిలే చేపపిల్లలు

ఆశ్చర్యంతో మెరిసే మిణుగురులు

ప్రేమికుడి గుండెల్లో తిన్నగా దిగే తియ్యని గునపాలు

చిలిపి ఊహలను చిలికించే తమలపాకు చిలకలు

చిరు చిరు నవ్వులు తొంగి చూసే కిటకీలు

ప్రేమను కురిపించే అమృతభాండాలు.

లామా అంతరంగం

చిన్నతనం లో వెన్నెల ను చూస్తే భయమేసేది

మల్లేలారబోసినట్టు

పాలకుండ ఒలికినట్టు

దూదిగుట్ట పరుచుకున్నట్టు ఉన్న

వెన్నెలను చూస్తే భయమేసేది.

మరీ ముఖ్యంగా వెండికొండల మీద

విరగ కాస్తున్న వెన్నెల ను చూస్తే భయమేసేది

ఉడుకు నెత్తురు ఒంట్లో

కోడె చూపు కంట్లో ఉంటే

బ్రహ్మచర్యం చెప్పిన బోధిసత్వుని పై ధ్యాస నిలుస్తుందా అని భయమేసేది!!!

యవ్వనం లో వెన్నెల ను చూస్తే భయమేసింది

పారిపోతున్న కొంగలబారులా

విధవ తెల్లచీరలా

పాల విరుగులా ఉన్న

వెన్నెలను చూస్తే భయమేసింది

మరీ ముఖ్యంగా వెండికొండల మీద

వేల దివిటీల లా వెలుగుతూ అంగుళం కూడా వదలకుండా

పారిపోతున్న లామాలను పిట్టల్లా కాలుస్తున్న

చైనా సైన్యానికి సహకరించిన

వెన్నెల ను చూస్తే భయమేసింది!!!

ముసలితనం లో వెన్నెలను చూస్తే భయమేస్తోంది.

గడ్డకట్టిన సున్నం లా

ఉప్పు మడిలో పేరుకున్న ఉప్పులా

కురిసేసిన మబ్బులా ఉన్న

వెన్నెలను చూస్తే భయమేస్తోంది.

మరీ ముఖ్యంగా లాసా నగరం నేలమట్టం

చేస్తూ బంగారు గనులను దోచేస్తున్న దొంగలకు

మెరుగులు పెడుతున్న వెన్నెలను చూస్తే భయమేస్తోంది.

పారిపోలేక, ప్రాణాలు ఇంకా పోకుండా

జీవచ్చవాలలా ఉన్న బంధు మిత్రుల రక్తధారలు పారుతున్న లాసా నదిపైనా కూడా ఇదే వెన్నెల అంటే భయమేస్తోంది.

దాటడానికి వీలులేనంత ఎత్తైన వెండికొండల మీద వెన్నెలను చూస్తే భయమేస్తోంది.

గురువులుగా గౌరవించబడినా, గుండెల మీద కాల్చినా

చెయ్యెత్తు కూడా లేని చైనా సైనికులను ఎదిరించే

చేవ ఉన్నా చేయలేకున్నా

అంతా పద్మసంభవుని ప్రవచనాలు వల్లే.

జీవితం అంతా మాల తిప్పుతూ ధ్యానం చేస్తున్నా ఏదో వెలితి.

కొండ దాటి కొత్త జీవితం మొదలు పెట్టినా, పుట్టిన గడ్డ ఇది కాదని దిగులు.

బ్రతుకంతా ఎవరో దాక్షిణ్యం పై గడపాలన్న గుబులు.

అసలు తథాగతుడు బోధ సరైనదేనా?

తనని తాను కాపాడుకోవడం కూడా హింసేనా??

కోరిక లేకపోవడం అంటే మాతృభూమి, మతం, అభిమతం

కూడా లేకపోవడమా???

స్వాతంత్ర్యం వచ్చింది

సమాజానికి స్వాతంత్ర్యం వచ్చిందట

అమ్మాయిల్ని పుట్టనివ్వట్లేదు.

విద్యా వైద్యాలకి స్వాతంత్ర్యం వచ్చిందట

సర్కారీ బళ్లు దవాఖానాల్ని తెరవనివ్వట్లేదు.

వ్యాపారులకు స్వాతంత్ర్యం వచ్చిందట

నాణ్యమైన సరుకు దొరకనివ్వట్లేదు.

స్త్రీలకు స్వాతంత్ర్యం వచ్చిందట

బట్టలు పూర్తిగా వేసుకోవట్లేదు.

పిల్లలకు స్వాతంత్ర్యం వచ్చిందట

తల్లిదండ్రులను ఇళ్లలో ఉండనివ్వట్లేదు.

ఇష్టమైన చదువు నేర్చుకుందామనుకున్నాను

కేపిటేషన్ ఫీ కొరినంత కట్టి చదువుకునే స్వాతంత్ర్యం ఉందట.

మెచ్చిన కొలువు చేద్దామనుకున్నాను

ఎవని ప్రాంతంలో వాళ్లకు స్వాతంత్ర్యం ఉందట.

నచ్చిన పిల్లను మనువాడదామనుకున్నాను

మాకులంలో వెతుక్కునే స్వాతంత్ర్యం ఉందట.

పనిచేసే పార్టీ ని ఎన్నుకుందామనుకున్నాను

పార్టీ ఏ మతం వారిదో తెలుసుకునే స్వాతంత్ర్యం ఉందట.

జెండా ఎగరేసి మిఠాయిలు పంచితే స్వాతంత్య్రం వచ్చిన రోజట బళ్ళో పిల్లాడు అన్నాడు.

డ్రై డే అయితే స్వాతంత్య్రం వచ్చిన రోజట కాలేజి కుర్రాడు అన్నాడు.

ఖైదీలను వదిలేస్తే స్వాతంత్య్రం వచ్చిన రోజట పొలిటీషియన్ అన్నాడు.

టీవీ లో దేశభక్తి గీతాలు వేస్తే స్వాతంత్య్రం వచ్చిన రోజట

టీవీ ఏంకర్ అన్నాడు.

ఇంకా స్వాతంత్ర్యం అంటే ఏంటో తెలియట్లేదుట జనానికి మైకుల్లో పాటలు పెట్టి వీధి వీధుల్లో హోరెత్తిస్తున్నారు.

Good Evening

గోవులు లేవు, గోధూళి లేదు.

గోపబాలురు లేరు, మురళి గానం అసలే లేదు.

చెట్టు లేదు, గుట్ట లేదు.

పొద్దువాలేక పిట్టలకు గూళ్ళూ లేవు.

అదేం చిత్రమో ఫాక్టరీ సైరన్లూ లేవు.

ఉన్నదొకటే ట్రాఫిక్ రొద, కార్ల పొగ.

కాలం కోడింగ్, టెస్టింగ్ ల మధ్య ఊగుతున్న పెండ్యులం.
ఆఫ్షోర్ మీటింగ్లతో రేయి, పెర్ఫార్మన్స్ రేటింగ్లతో యవ్వనం గడిచిపోతోంది.

ఏం జరిగిందో తెలిసేలోగా జీవితం పొద్దువాలిపోతోంది.